ఏసీబీ కోర్టులో వాదనలు.. 409 సెక్షన్ పెట్టడం సబబు కాదన్న లూథ్రా.. కేసుపై మాట్లాడుతున్న చంద్రబాబు..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును నంద్యాలలో శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ఈ క్రమంలోనే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఎట్టకేలకు 24 గంటల సమయం ముగిసే సమయానికి(ఈరోజు తెల్లవారుజామున) విజయవాడ కోర్టు కాంప్లెక్స్‌లోని ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచారు.
ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఓపెన్ కోర్టులో వాదనలు వినేందుకు ఏసీబీ న్యాయమూర్తి అంగీకరించారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ బృందం వాదనలు వినిపిస్తుంది. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించేందుకు ముగ్గురు న్యాయవాదులు అనుమతి కోరగా.. ఇద్దరికి మాత్రమే న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు తరఫున సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుపై 409 సెక్షన్ పెట్టడం సబబు కాదని సిదార్థ లూథ్రా వాదనలు వినిపించారు. 409 పెట్టాలంటే ముందుగా సరైన సాక్ష్యాధారాలు చూపించాలని అన్నారు. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని సిద్దార్థ లూథ్రా నోటీసు ఇచ్చారు. తిరస్కరణలపై వాదనలకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని చంద్రబాబు ఏసీబీ న్యాయమూర్తిని కోరారు. అందుకు ఏసీబీ న్యాయమూర్తి అనుమతించడంతో.. చంద్రబాబు కోర్టులో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఇరుపక్షాల వాదనల అనంతరం చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, ఏసీబీ కోర్టుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్‌కు కూడా వచ్చారు.