గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు గానీ తాను వ్యతిరేకం కాదని సినీ హీరో శివాజీ అన్నారు. అయితే తనను కించపరిస్తే మాత్రం వ్యతిరేకిస్తానని ఆయన అన్నారు. శనివారం గుంటూరులో రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

తాను బిజెపికి వ్యతిరేకం కాదని అంటూ ప్రధాని మోడీకి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలకు మాత్రమే వ్యతిరేకమని శివాజీ అన్నారు. తనను టార్గెట్ చేసే నేతలను బట్టలు ఊడదీసి కొడుతానని ఆయన అన్నారు. తన ఉద్యమం వెనక ఏ రాజకీయ పార్టీ కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. 

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ కారెం శివాజీతో కలిసి తాను ఉద్యమం చేశానని ఆయన చెప్పారు. తాను చెప్పిన ఆపరేషన్ గరుడ ద్రవిడ కర్ణాటకలో ప్రారంభమైందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి పీఠంపైనే దృష్టి ఉంది ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. తనకు రాజకీయ కాంక్ష లేదని అన్నారు. 

దళితులను దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులను కాపాడడానికి గిరిజనులు కలిసి రావాలని నక్కా ఆనందబాబు కోరారు.