ఇటీవల ఖాళీ అయిన శాసనమండలి ఛైర్మన్ పదవికి టిడిపి ఎమ్మెల్సీ ఎం.ఎ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో శాసనమండలి ఛైర్మన్ ఫరూఖ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో మరో మైనారిటీ నాయకుడు షరీఫ్ కు ఈ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ సీఎం షరీఫ్ తో నామినేషన్ వేయించారు.  

ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. దీంతో శాసనమండలి ఇన్‌చార్జి చైర్మన్ గా వ్యవహరిస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం ఇవాళ ఉదయం శాసనమండలి చైర్మన్ పదికోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈరోజు సాయంత్రంలోగా నామినేషన్లను దాఖలుకు సమయం ఇవ్వగా టిడిపి తరపున షరీఫ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం ఉదయం 11.30 నిమిషాలకు శాసనమండలి చైర్మన్ ఎన్నిక ఫలితాలు ప్రకటిస్తామని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి ఎన్నికల లేకుండా ఏకగ్రీవంగానే షరీప్ ఛైర్మన్ పదవి చేపట్టనున్నారు. 

శాసన మండలి ఛైర్మన్ పదవికి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే షరీప్ నామినేషన్ కు సిద్దమయ్యారు. ఉదయం మంత్రులు యనమల రామకృష్ణడు, నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కె.ఎస్.జవహర్‌తో పాటు శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్‌తో కలిసి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు అందజేశారు.