కాకినాడ: తూర్పు గోదావరి  జిల్లా కాకినాడ పట్టణంలో  జగన్నాథపురం వాటర్‌ ట్యాంక్‌ వద్ద నేతాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ కు గురైంది. పోలీసులు  పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ బాలిక కిడ్నాప్ వెనుక సవతి తల్లి పాత్ర ఉందని చిన్నారి నాయనమ్మ ఆరోపిస్తోంది.

సవతి తల్లి శాంతి కుమారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. దీప్తిశ్రీని గొంతునులిమి హత్యచేసి ఉప్పుటేరు కాల్వలో పడేశానని కాసేపు, సంజయ్‌ నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ వద్ద పడేసానని పోలీసుల విచారణలో రకరకాలుగా సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు దీప్తిశ్రీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

శుక్రవారం నుంచి దీప్తిశ్రీ  కన్పించకుండాపోయింది. తూరంగి పంచాయతీ పగడాలపేటకు చెందిన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసానిని శుక్రవారం పాఠశాల నుంచి నేరుగా కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు చిన్న నానమ్మ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లింది. 

సాయంత్రం ఆమె ఇంటికి చేరకపోవడంతో తండ్రి సూరాడ సత్యశ్యామ్‌ కుమార్‌ ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో కాకినాడ వన్‌టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సత్యశ్యామ్ మొదటి భార్య సత్యవేణి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. రెండో భార్యగా కాకినాడ సంజయ్‌నగర్‌కు చెందిన శాంతికుమారిని సత్యశ్యామ్‌ పెళ్లి చేసుకొన్నాడు.తన మనుమరాలిని కోడలు శాంతికుమారి, ఆమె చెల్లెలు జ్యోతి కిడ్నాప్‌ చేసి ఉంటరని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. 

గతంలో కుమారుడు రాజమహేంద్రవరంలో ఉంటూ సీసీ కెమెరాలు బాగు చేసే పని చేసేవాడని, రెండో కోడలికి ఏడాది క్రితం బాబు పుట్టాడని చెప్పింది. ఆ సమయంలో దీప్తిశ్రీకి నెలకు రూ.2 వేలు చొప్పున బ్యాంకులో వేయాలని అడిగితే కోడలు అభ్యంతరం చెప్పిందన్నారు.

 రాజమహేంద్రవరంలో ఉంటున్నప్పుడు ఏడాది క్రితం ఈ చిన్నారిని అట్లకాడతో చెయ్యి, కాలు, మూతిపై కాల్చివేసిందని తెలిపారు. తన మనమరాలి అడ్డుతొలగించుకునేందుకే కిడ్నాప్‌ చేయించిందని ఆరోపించింది. మనుమ రాలిని తండ్రి  పాఠశాలకు తీసుకెళ్లేవాడని  తెలిపింది. 

శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ మహిళ పాఠశాలకు వచ్చి ఆమెని కొద్ది దూరం తీసుకువెళ్లి బైక్‌పై వ్యక్తితో వెళ్లినట్లు నమోదైందని ఒన్‌టౌన్‌ సీఐ రామోహన్‌రెడ్డి తెలిపారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం నుంచి చిన్నారి సవతి తల్లి శాంతికుమారి, ఆమె బంధువులను స్టేషన్‌లో విచారణ చేస్తున్నారు.