ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్దిరోజులుగా రోజుకు 300కు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కోవిడ్ 19 సోకినట్లు అధికారులు తెలిపారు.

పోడూరు మండల పరిధిలోని జిన్నూరు గ్రామం భూపయ్య చెరువు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఐదు రోజుల క్రితం ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్థారించారు.

దీంతో కుటుంబసభ్యులు ఏడుగురికి అదే రోజు పరీక్షలు నిర్వహించారు. పరీక్షా ఫలితాల ఆధారంగా వీరికి కరోనా నిర్థారణ కావడంతో  చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

జిన్నూరులోని సుబ్బారాయుడు కాలనీలో మరొకరికి కూడా నిర్థారించారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కరోనా బాధితులకు సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు అధికారులు సర్వే చేపడున్నారు.

ఇప్పటి వరకు పోడూరు మండలం జిన్నూరులో 38 మంది, పోడూరులో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయని పోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.