ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో..  పార్టీ మారే నేతలు పెరిగిపోతున్నారు. ఏ పార్టీలో తమకు సీటు గ్యారెంటీ అనిపిస్తుందో.. ఆ పార్టీలోకి జంప్ చేయడానికి రెడీ అయిపోయారు. తాజాగా మరో వైసీపీ నేత టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

విజయనగరం  జిల్లా గరుగుబిల్లి మండల వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమయంలో ఎంపీపీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం వైసీపీలో చేరారు. ఆపార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఆయన రేపో, మాపో టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

పార్టీలో గుర్తింపు లేకపోవడం, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చూపిస్తున్న అధికారం ఊరిటి రామారావుకి నచ్చడం లేదట. దీంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు టీడీపీ నేతలతో సమావేశం కాగా.. వారు కూడా అందుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అయితే.. వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడే.. ఆయనకు తెలిసేలా.. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.