Asianet News TeluguAsianet News Telugu

టీడీపీకి సీనియర్ల టెన్షన్.. ‘‘లాస్ట్ ఛాన్స్’’ అంటూ వేడుకోలు , చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో..?

యువతకు ఈసారి పెద్ద పీట వేయాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. కానీ ఇది పార్టీలో సీనియర్లను అసంతృప్తికి గురిచేస్తుంది. తెలుగుదేశంలో దాదాపు 40 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న వారు వున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలలో కీలక పదవులు అనుభవించడంతో పాటు చక్రం తిప్పిన నేతలు ఎంతోమంది వున్నారు.

senior leaders in telugu desam party are unhappy ksp
Author
First Published Jan 16, 2024, 3:11 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలు టీడీపీకి చావో రేవో వంటివి . ఈసారి పార్టీ గెలవకపోతే.. అది తెలుగుదేశం ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతోంది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు వయోభారాన్ని పరిగణనలోనికి తీసుకుంటే 2024 ఆ పార్టీకి జీవన్మరణ సమస్య వంటిది. అందుకే చంద్రబాబు అన్ని రకాల అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని జగన్‌పై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.

జనసేనతో పొత్తు దగ్గరి నుంచి అభ్యర్ధుల ఎంపిక , ప్రచారం అన్నింట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొత్తులో పోయిన సీట్లు, సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను మినహాయించి మిగిలిన సీట్ల విషయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చడం చంద్రబాబు స్టైల్ . ఈ వ్యూహం కొన్నిసార్లు మిస్ ఫైర్ అయితే, కొన్నిసార్లు సక్సెస్ అయ్యింది. 

కానీ ఈసారి మాత్రం ఎన్నికలకు ముందే అభ్యర్ధులను ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారట. నేతలు జనంలో వుండటంతో పాటు అసంతృప్తులను కూడా బుజ్జగించేందుకు సమయం దొరుకుతుందని చంద్రబాబు ఆలోచన కావొచ్చు. ఇదే సమయంలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ను చంద్రబాబు ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారట. గెలవరు అని తెలిస్తే చాలు తనమన అన్న తేడా లేకుండా నో చెప్పేయాలని బాబు డిసైట్ అయ్యారట. అంగ బలం , అర్థ బలంతో పాటు నియోజకవర్గంలో పరపతి ఇలా పలు అంశాలను చంద్రబాబు పరిగణనలోనికి తీసుకుంటున్నారు. 

అలాగే యువతకు ఈసారి పెద్ద పీట వేయాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. కానీ ఇది పార్టీలో సీనియర్లను అసంతృప్తికి గురిచేస్తుంది. తెలుగుదేశంలో దాదాపు 40 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న వారు వున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలలో కీలక పదవులు అనుభవించడంతో పాటు చక్రం తిప్పిన నేతలు ఎంతోమంది వున్నారు. వీరిలో కొందరు తమకు తాముగా రిటైర్‌‌మెంట్ ప్రకటించగా.. మిగిలిన వారు మాత్రం బరిలో దిగాలని భావిస్తున్నారు. వయసును కారణంగా చూపి తమను పక్కనబెడితే ఊరుకునేది లేదని  కొందరు నేరుగా సంకేతాలు పంపుతున్నారు.

తమకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు కానీ.. తమకు , తమ వారసులకు టికెట్లు కావాలని తేల్చిచెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్ధితి నెలకొంది. ఇస్తే ఇద్దరికీ టికెట్ ఇవ్వాల్సిందేనని, తమ స్థానంలో మరొకరిని తెచ్చిపెడితే సహకరించేది లేదని వారు హైకమాండ్‌కు అల్టీమేటం జారీ చేస్తున్నారు. టికెట్ దక్కదని క్లారిటీ వచ్చిన నేతలు మరో మాట లేకుండా రాజీనామా చేస్తున్నారు. వీరిని బుజ్జగించేందుకు పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లభించడం లేదు. మరి సీనియర్లను చంద్రబాబు అండ్ కో ఎలా మేనేజ్ చేస్తారో వేచి చూడాలి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios