సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర సంబంధాలపై ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తారు.

ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పీ. సీసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. అమర్ 1975లో ప్రజాతంత్ర పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రభలో స్టాప్ కరస్పాండెంట్‌గా, సహాయ సంపాదకుడిగా పనిచేశారు.

అనంతరం ఈనాడు, ఉదయం, ఆంధ్రభూమి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ పత్రికలలో పనిచేశారు. రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్‌ అధ్యక్షునిగా.. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా రెండు సార్లు బాధ్యతలు నిర్వహించారు. అమర్ ప్రస్తుతం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు.