తన కేసు విషయంలో కుట్ర జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ ఐపీఎస్, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు. ఆయనపై కమీషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముగిసిన అనంతరం ఏబీ ఆదివారం మీడియాతో మాట్లాడారు.

తనపై కుట్ర పన్ని కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారని ఆయన ఆరోపించారు. 30 ఏళ్లు నిజాయతీగా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిపై విచారణ పేరుతో కాలయాపన చేయడం దారుణమన్నారు. 

కమిషనర్‌ తన వాదనలను సావధానంగా విన్నారని.. తన వాదనకు అవకాశం కల్పించిన సుప్రీంకోర్టుకు రుణపడి ఉంటానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. తనపై కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారనేదానికి సాక్ష్యాలున్నాయని.. ఈ  విషయాన్ని విచారణాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

కృత్రిమ డాక్యుమెంట్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తానే స్వయంగా 21 మంది సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశానని... 14 రోజుల నుంచి కొనసాగిన విచారణ నేటితో ముగిసిందని తెలిపారు.

నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టుకు ఏబీ ధన్యవాదాలు చెప్పారు. దేశంలో 14 రోజుల్లో విచారణ పూర్తి చేసిన కేసు తనదే అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసు విషయంలో కమిషనర్‌ త్వరలోనే తన నిర్ణయం చెబుతారని ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.