ఏ బాధ్యతలు అప్పగిస్తారో?:ఏపీకి బయలుదేరిన సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సోమేష్ కుమార్ వెళ్లారు ఇవాళ ఏపీ సీఎం సీఎం జగన్ ,ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సోమేష్ కుమార్ భేటీ కానున్నారు.
హైదరాబాద్: మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విజయవాడకు బయలుదేరారు. ఇవాళ ఉదయం 10:15 గంటలకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సోమేష్ కుమార్ భేటీ కానున్నారు. సీఎస్ తో భేటీ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సోమేష్ కుమార్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సోమేష్ కుమార్ సీఎం .జగన్ తో భేటీ అవుతారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్రంలో విధులు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ కేడర్ ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చింది. సోమేష్ కుమార్ కు తెలంగాణ కేడర్ ను కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. డీఓపీటీ ఆదేశాల మేర కు గతంలో కేటాయించిన ఏపీ కేడర్ కు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయడానికి సోమేష్ కుమార్ విజయవాడకు బయలుదేరారు. హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి సోమేష్ కుమార్ విజయవాడకు వెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ఆయన నేరుగా ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. సీఎస్, సీఎంలతో భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సోమేష్ కుమార్ రావడంతో ఆయనకు ప్రభుత్వం ఏ పోస్టును కేటాయిస్తుందనే చర్చ సర్వత్రా సాగుతుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలనే జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది .జవహర్ రెడ్డి గతంలో సీఎంఓలో పనిచేశారు. అయితే సోమేష్ కుమార్ కు సీఎస్ స్థాయి పదవిని కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. సోమేష్ కుమార్ ను సీఎంఓలోకి తీసుకుంటారా లేదా ఇతర బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయమై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు.
also read:తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి.. బాధ్యతల స్వీకరణ, కేసీఆర్‌తో భేటీ
తెలంగాణలో సీఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ కు అదే స్థాయిలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఏ శాఖలో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉంది. సీనియర్ ఐఎఎస్ అధికారుల పోస్టింగ్ ల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం లేకపోలేదు. సోమేష్ కుమార్ ఏపీకి వస్తున్న నేపథ్యంలో సుమారు 15 మంది ఐఎఎస్ అధికారుల పోస్టింగుల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సోమేష్ కుమార్ స్థానంలో శాంతికుమారిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.