అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఏపీ పోలీస్ యంత్రాంగం. వైయస్ జగన్ ఇంటి వద్ద సెక్యూరిటీని టైట్ చేసింది. ఇప్పటికే సాయుధ పోలీసు బలగాలతోపాటు స్థానిక పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. 

అయితే వైయస్ జగన్ ఆగష్టు 1 నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్న నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్లను రంగంలోకి దించారు. వైయస్ జగన్‌ నివాసం డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్నారు. జగన్ చుట్టూ 200 మీటర్ల ఎత్తున పోలీసు డ్రోన్లతో భద్రత కల్పించారు.  

అలాగే జగన్ నివాసంతోపాటు సీఎం నివాసానికి వచ్చే దారుల్లోనూ డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ కెమెరాల దృశ్యాలను మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ప్రాంగణంలో ఉన్న టెక్‌ టవర్‌ నుంచి ఉన్నతాధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. 

సీఎం వైయస్ జగన్ భద్రతకు సంబంధించి ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది పోలీస్ శాఖ. టెక్ టవర్ నుంచి భద్రతను పర్యవేక్షించడంతోపాటు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. 

సీఎం జగన్ నివాసానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడంతోపాటు ఆందోళన కారుల నిరసన ప్రదర్శనలను ముందే తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి నివాసం వద్ద డ్రోన్లను వినియోగించడం సంచలనంగా మారింది. 

గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులను కూంబింగ్ కు వెళ్లే సమయంలో అడవుల్లో వారిని పసిగట్టేందుకు డ్రోన్లు ఉపయోగించేవారు. అయితే తాజాగా సీఎం జగన్ నివాసం వద్ద తొలిసారిగా డ్రోన్లను ఏర్పాటు చేశారు. జగన్ నివాసం వద్ద భద్రతతోపాటు నిరసన కార్యక్రమాలు, ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డ్రోన్లతో పర్యవేక్షించాల్సి ఉందంటున్నారు. 

అలాగే ఆగష్టు 1 నుంచి సీఎం వైయస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారని దానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే నిత్యం ప్రజాప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు జగన్ ను కలుసుకునేందుకు వస్తున్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.