అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి సరైన చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తీసుకువెళ్తే... డాక్టర్ ని కలిసే అవకాశం ఇవ్వకపోగా.. దారుణంగా దాడి చేశారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ సెక్యురిటీ గార్డులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అనాకపల్లిలోని వేల్పలవీధికి చెందిన రాజేష్, శ్యామల దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఐదేళ్ల వయసుగల వారి కుమారుడు ఈ మధ్య తరచుగా అనారోగ్యానికి గురౌతున్నాడు. ఈ క్రమంలో దంపతుతులు గురువారం ఉదయం ఎన్టీఆర్ వైద్యాలయానికి తమ కుమారుడిని తీసుకొని వెళ్లారు. చిన్న పిల్లల వైద్యుడి వివరాలు ఇవ్వాలంటూ వారు ఆస్పత్రిలో కోరారు. ఆ సమాచారం ఇవ్వకపోగా వారి పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఆ వెనువెంటనే సెక్యురిటీ గార్డులు వచ్చి దంపతులపై దాడి చేశారు. దారుణంగా వారిని చితకబాదారు.  స్థానికులు సెక్యురిటీ గార్డులపై తిరగబడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సందర్భంగా బాధితుడు రాజేష్ మీడియాతో మాట్లాడారు.

ఇప్పటికి తాము ఎనిమిదిసార్లు ఆస్పత్రికి వచ్చామని చెప్పారు. ఎన్నిసార్లు వచ్చినా డాక్టర్ ని కలవనివ్వడం లేదన్నారు. ఒకవేళ డాక్టర్ లేకపోతే.. తాము ఎదురు చూస్తామని ఓపీ స్లిప్ రాసివ్వమని మాత్రమే అడిగామని వారు చెప్పారు. అయినా వినిపించుకోలేదన్నారు. ఈ సమయంలోనే సెక్యురిటీ వచ్చి తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒక్క వీరి విషయంలో మాత్రమే కాదని... చాలా మంది రోగులు, వారి బంధువుల విషయంలో సెక్యురిటీ అలానే ప్రవర్తించారని అక్కడివారు చెబుతున్నారు. ఆ సెక్యురిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.