Asianet News TeluguAsianet News Telugu

నీలం సాహ్నికి కోర్టులో భారీ ఊరట..!

నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సీఎం సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

SEC Nilam Sawhney gets AP HC relief
Author
Hyderabad, First Published Oct 8, 2021, 9:29 AM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ నీలం సాహ్నీకి హైకోర్టు ఊరట లభించింది. ఆమె నియామకం చెల్లదని దాఖలైన పిటీషన్‌ను ఉన్నత న్యాయస్థానం గురువారం కొట్టేసింది. విజయనగరం జిల్లాకు చెందిన రేగు మహేశ్వరరావు నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సీఎం సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

నీలం సాహ్నిపై రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని కోర్టుకి తెలిపారు. అయితే రెండు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించలేదు. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకం కరెక్టేనని నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది.

ఆమె నియామకం విషయంలో ఏకపక్షత, దురుద్దేశాలు ఉన్నాయని నిరూపించడంలో పిటిషనర్‌ విఫలమయ్యారంది. ఎన్నికల కమిషనర్‌గా ఆమెను నియమించడం వల్ల పిటిషనర్‌ చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ హక్కులకు ఎలాంటి విఘాతం కలగలేదని తెలిపింది. హక్కుల ఉల్లంఘన జరగనప్పుడు పిటిషనర్‌ ‘మాండమస్‌’ కోరలేరని న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం తీర్పునిచ్చారు. ఎన్నికల కమిషనర్‌గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలం సాహ్నిని వివరణ కోరడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది మహేశ్వరరావు హైకోర్టులో  పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios