Asianet News TeluguAsianet News Telugu

డబ్ల్యూహెచ్‌ఓ సూచనల ప్రకారమే ఏపీలో బడులు తెరిచాం : సీఎం జగన్‌

డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ సూచనల మేరకు బడులు తెరిచాం. పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించాం. కోవిడ్ ప్రొటోకాల్స్‌ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. 

schools opened as per WHO instructions : CM jagan
Author
Hyderabad, First Published Aug 16, 2021, 3:28 PM IST

తూర్పుగోదావరి : కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. 

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సీఎం జగన్‌ సోమవారం వీటిని విద్యార్థులకు అంకితం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ‘‘ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం. నేడు మూడు కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటిది ఈ రోజు నుంచి బడులు తెరుస్తున్నాం. రెండేళ్ల నుంచి విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు. డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ సూచనల మేరకు బడులు తెరిచాం. పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించాం. కోవిడ్ ప్రొటోకాల్స్‌ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించాం.  టీచర్లకు అందరికి టీకాలిచ్చాం’’ అని తెలిపారు. 

‘‘పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు 'జగనన్న విద్యాకానుక' ఇస్తు‍న్నాం. దీనిలో భాగంగా 47.32 లక్షల మంది విద్యార్ధులకు 731.30 కోట్లతో 'జగనన్న విద్యాకానుక' ఇస్తున్నాం. విద్యాకానుకలో ఒకవైపు తెలుగు, మరో వైపు ఇంగ్లీష్ భాషల్లో ఉన్న బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, డిక్షనరీ ఇస్తున్నాం. ఐదో తరగతి వరకు విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలతో ఇంగ్లీష్‌ డిక్షనరీ ఇస్తున్నాం’’ అని తెలిపారు.  

‘‘నాడు-నేడుతో తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలల అభివృద్ధి చేశాం. నేడు రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నాం. నాడు-నేడు కింద స్కూళ్లలో ఫర్నిచర్, నీటివసతి, రక్షిత తాగునీరు, పెయింటింగ్స్‌..గ్రీన్‌ చాక్‌ బోర్డ్‌, ఇంగ్లీష్ ల్యాబ్‌, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ప్రహరీ గోడ, వంటగది నాడు-నేడుతో ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్‌ ల్యాబ్‌ కూడా తీసుకొచ్చాం’’ అని  సీఎం జగన్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios