విజయవాడలో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. తెలిసీ తెలియని వయసులో తనకంటే జూనియర్ అయిన ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా తన ప్రేమకు అడ్డుపడ్డాడని తోటి విద్యార్థిని బ్లేడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ విద్యార్థి తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిట్టినగర్ కు చెందిన ఓ విద్యార్థి అదే ప్రాంతంలోని ఓ స్కూళ్లో 9వ తరగతి చదువుతున్నాడు. అదే స్కూళ్లో 8వ తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో నిత్యం వేధించేవాడు. దీంతో ఆ బాలిక తన తోటి బాలుడికి ఈ వేధింపుల గురించి చెప్పింది. దీంతో అతడు ఈ విషయాన్ని టీచర్ల దృష్టికి తీసుకేళ్ళడంతో వేధింపులకు పాల్పడుతున్న బాలున్ని మందలించారు.

దీంతో తనపై ఫిర్యాదు చేసి తన ప్రేమకు అడ్డుపడ్డాడని ఫిర్యాదు చేసిన విద్యార్థిపై సదరు బాలుడు రగిలిపోయాడు. దీంతో ఆ  బాలుడు ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి అతడిపై బ్లేడ్ తో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాధిత విద్యార్థి చేతులు, కాళ్లకు గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న వయసులోనే తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని...లేదంటే ఇలాంటి ఘటనలకు పాల్పడి వారి భవిష్యత్ నాశనం చేసుకుంటారని పోలీసులు హెచ్చరించారు.