విజయవాడ: ఎస్సీ వర్గీకరణ అంశం టీడీపీలో మరోసారి తెరమీదికి వచ్చింది. మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలు ఇవాళ విజయవాడలో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకురానుంది.

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పలు కీలక అంశాలపై టీడీపీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ, తెలంగాణ తదితర అంశాలపై టీడీపీ తన వైఖరిని ప్రకటించింది.

2014లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు  టీడీపీ ఇటీవల ప్రయత్నాలను ప్రారంభించింది.

ఎస్సీ వర్గీకరణపై పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీకి చెందిన మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీ రాష్ట్రంలో మాల సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

టీడీపీకి చెందిన నేతలు ఎస్సీ వర్గీకరణ విషయమై ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. ఎస్పీ వర్గీకరణకు టీడీపీ అనుకూలమని గతంలో ప్రకటించింది. 

అయితే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయంలో గుంటూరులో నిర్వహించిన మందకృష్ణ సభ విషయంలో టీడీపీపై పెద్ద ఎత్తున విమర్శలు నెలకొన్నాయి. ఈ విషయమై మందకృష్ణ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈ సభకు చంద్రబాబు సర్కార్ అనుమతి ఇవ్వలేదు. మందకృష్ణను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

టీడీపీకి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇవాళ విజయవాడలో సమావేశం కావడం చర్చకు దారితీసింది. ఈ సమావేశానికి టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలు హాజరయ్యారు.