హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఎంత కఠినంగా వున్నారో అవసరమైతే అంతకంటే ప్రేమగా కూడా వుండగలమని తెలంగాణ పోలీసులు నిరూపింంచారు. తన గారాల పట్టి పుట్టినరోజును లాక్  డౌన్ కారణంగా మిస్సవుతున్న ఓ తండ్రి కోరికను మన్నించి అతడి కుటుంబంలో ఆనందాన్ని నింపారు హైదరాబాద్ పోలీసులు. పోలీసులే దగ్గరుండి యువతిచేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుక జరిపి ఆమె తండ్రి కోరికను నెరవేర్చారు. ఇలా ఆ తండ్రికే కాదే వారి కుటుంబంలో ఆనందాన్ని నింపారు పోలీసులు. 

వివరాల్లోకి వెళితే సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీలో విజయ్ కుమార్ అనే వ్యక్తి భార్యా , ఇద్దరు కుమార్తెలతో  కలిసి నివాసముంటున్నారు. అయితే విజయ్ కుమార్ బెంగుళూరులో ఉద్యోగం చేస్తుండటంతో వారాంతాల్లో హైదరాబాద్ కు వచ్చి కుటుంబంతో గడిపేవాడు. కానీ లాక్ డౌన్ కారణంగా అతడు బెంగళూరులోని చిక్కుకుపోయాడు. దీంతో గత రెండు నెలలుగా కుటుంబానికి దూరమయ్యాడు. 

అయితే నిన్న(గురువారం) అతడి గారాల పట్టి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు రుచిత పుట్టినరోజు. ప్రతీ సంవత్సరం విజయ్ కుమార్ దగ్గరుండి కూతురి పుట్టినరోజు వేడుక జరిపేవాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈసారి అది కుదరలేదు. 

అయితే అతడు ఇంటివద్ద లేకున్నా కూతురు పుట్టినరోజు వేడుక జరపాలని ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. తన పరిస్థితిని సరూర్ నగర్ పోలీసులకు వివరించిన అతడు కూతురి పుట్టినరోజు వేడుక జరపాలని కోరాడు. అతడు కోరికను మన్నించిన సరూర్ నగర్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి రుచిత ఇంటివద్దే పుట్టినరోజు వేడుక జరిపారు. ఆమె పుట్టినరోజు నాడు ఒక కేకు, చాక్లెట్స్, బిస్కెట్స్  తీసుకొని రుచిత నివాసముండే ఇంటివద్దకే వెళ్లి ఆమెచేత కేక్ కట్ చేయించారు. ఈ మొత్తం సన్నివేశాన్ని ఆమె తండ్రి విజయ్ కుమార్ కి వాట్సప్ వీడియో కాల్ ద్వారా చూపించారు. 

ఓ సామాన్యుడి కోరికను మన్నించి సరూర్ నగర్ పోలీసులు చేసిన ఈ పని పోలీసులు కఠినంగానే కాదు ప్రేమగా వుంటారని నిరూపించింది. ఇలా ఓ కుటుంబంలో ఆనందాన్ని నింపిన పోలీసులను  ప్రజలు ప్రశంసిస్తున్నారు.