ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. దందాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిపై దాడికి దిగింది. వివరాల్లోకి వెళితే.. సిద్ధవటం మండలం ఎస్.రాజంపేటలో పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న వీఆర్వో ఆరిఫ్, వీర్ఏ వెంకటపతి ఘటనా స్థలికి వెళ్లారు.

బైక్ నుంచి ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించిన వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అనంతరం ట్రాక్టర్ బోల్తాపడింది.

దీంతో ట్రాక్టర్‌ను వదిలేసి డ్రైవర్,  మరో వ్యక్తి పరారయ్యారు. గాయపడిన రెవెన్యూ సిబ్బందిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.