కాకినాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాపారి సానా సతీష్ బాబు ఆస్తులపై సిబిఐ బృందాలు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం సిబిఐలో కొనసాగుతున్న రచ్చకు ఆయనే కారణం. కాకినాడలోని సతీష్ బాబు చెందిన ఆవరణల్లోనే కాకుండా పెద్దాపురం, సామర్లకోటల్లోని ఆయన బంధువుల ఇళ్లలో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఇద్దరు అనువాదకులను వెంట పెట్టుకునిస సిబిఐ బృందం ఢిల్లీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ  క్రికెట్ కోచ్ కు చెందిన ఫార్మసీ కాలేజీలో కూడా సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.

సతీష్ బాబుకు ఐదు కంపెనీలతో పాటు ఓ నైట్ క్లబ్ ఉన్నాయి. మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీ పన్ను ఎగవేత కేసులో ఊరట కలిగించేందుకు సతీష్ బాబు సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానాకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. 

దానికి ప్రతిగా అస్థానా సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై ఆరోపణలు చేశారు. కేసులో క్లీన్ చిట్ ఇచ్చేందుకు వర్మకు సతీష్ బాబు 2 కోట్లు రూపాయలు ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు. దానిపై దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో సిబిఐలో వివాదం చోటు చేసుకుంది. ఇద్దరు అధికారులను సెలవుపై పంపించారు.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ సిబిఐ డైరెక్టర్ తో మాట్లాడారని, ఆ తర్వాత తనను విచారణకు పిలువ లేదని సతీష్ బాబు చెప్పారు. 

కాకినాడలో సతీష్ బాబుకు చెందిన కాకినాడలోని అతిథి గృహంలో సిబిఐ బృందం సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సిబిఐ బృందం కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.