అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి కీలక పదవి వరించింది. సజ్జలకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఏపీ సీఎం వైయస్ జగన్ ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డికి కేబినెట్ ర్యాంక్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే సజ్జల రామకృష్ణారెడ్డి నియామకం అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో జారీ చేసింది.

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీ సీఎం వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడుగా, రాజకీయ వ్యవహారాల సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డేనని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్టుగా పనిచేస్తూ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. జర్నలిజంలో అపార అనుభవం కలిగిన ఆయన వైసీపీలో జగన్ రాజకీయ సలహాదారుగా, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ సజ్జల పనిచేస్తున్నారు.