తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి సాకు కోసం వెతుకుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి సాకు కోసం వెతుకుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గతంలో ఓటర్లను తప్పించడానికి చంద్రబాబు టెక్నాలజీని వినియోగించారని ఆరోపించారు. ప్రభుత్వ పాలన సరిగా చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో అడ్డదారులు తొక్కాల్సిన అవసరం తమకెందుకని ప్రశ్నించారు. వైసీపీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సజ్జలతో ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ 12 ఏళ్లుగా పార్టీని ఆదర్శవంతంగా నడుపుతున్నారని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు జగన్ అని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణ తీసుకొచ్చారని తెలిపారు. దేశ చరిత్రలోనే ఎవరూ చేయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారని అన్నారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారి అన్నారు. ప్రజాస్వామ్యంలో వైసీపీ ఓ రోల్ మోడల్ అని.. తమ పార్టీకి ఎప్పటికీ ఓటమి ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ఎంత మంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవాలని సీఎం జగన్ ఏనాడూ అనుకోలేదని అన్నారు. ఉద్యోగులు వేరు ప్రభుత్వం వేరు అన్న భావన సీఎం జగన్‌కు లేదన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమే అని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను రాజకీయాలకు వాడుకున్నారని ఆరోపించారు.
