ఎమ్మెల్సీ ఎన్నికలు సమాజం మొత్తాన్ని రిప్రజెంట్ చేసేవి కావు.. ఏదో మారిపోయిందని అనుకోవద్దు: సజ్జల
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్ తుదిదశలో ఉందని.. అక్కడ తమ నాయకులు కొన్ని అవకతవకలు పరిశీలించి ఫిర్యాదులు చేయడం జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేయాలని చూస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్ తుదిదశలో ఉందని.. అక్కడ తమ నాయకులు కొన్ని అవకతవకలు పరిశీలించి ఫిర్యాదులు చేయడం జరిగిందన్నారు. ఓట్ల బండిల్‌లో ఏదో గందరగోళం జరిగిందని నిరూపణ అయిందని చెప్పారు. కౌంటింగ్ అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. దానిపై ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉందన్నారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సజ్జల రామకృష్ణా రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఇవి సమాజంలోని అన్ని సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికలు కావని అన్నారు. తాము టీచర్లది, పట్టభద్రులది ప్రయోగంగా చేశామని చెప్పారు. ఉపాధ్యాయులు చాలా బాగా ఆదరించారని అన్నారు. ఫస్ట్ టైమ్ తాము టీచర్స్ నియోజకవర్గాలనుగెలుచుకున్నామని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దని అన్నారు. ఈ ఫలితాలతో డీలా పడాల్సిన అవసరం లేదని చెప్పారు.. నాలుగేళ్లలో సీఎం జగన్ సంక్షేమ పథకాలతో వెలుగునింపుతున్న కుటుంబాలకు చెందిన ఓటర్లు ఇందులో లేరని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో ఎక్కువగా ఉండే పీడీఎఫ్ వాళ్లు టీడీపీతో అవగాహన కుదుర్చుకున్నారని.. వాళ్ల ఓట్లు టీడీపీ వైపు వెళ్లాయని చెప్పారు. తాము ఎన్నికలకను సీరియస్‌గా తీసుకున్నామని.. పట్టభద్రుల విషయంలో తమ వ్యుహాలను కింద స్థాయి వరకు వెళ్లడంలో విఫలం అయి ఉండొచ్చని అన్నారు.
అయితే రాష్ట్రంలో మొత్తం గ్రాడ్యుయేట్స్ ఎన్‌రోల్‌మెంట్ జరగలేదని అన్నారు. తమ ఓటర్లు వేరే ఉన్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఈ ఎన్నికలు రిప్రజేంట్ చేయవని తెలిపారు. జనరల్ ఎన్నికలను ప్రభావితం చేసే ఓటర్లు ఈ ఎన్నికల్లో లేరని అన్నారు. బలం పెరిగిందని టీడీపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం అని అన్నారు. ఇవి సమాజం మొత్తాన్ని రిప్రజెంట్ చేసే ఎన్నికలు కావని.. ఓ సెక్షన్ మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటర్లు అని సజ్జల చెప్పుకొచ్చారు.