ఏపీ కేబినెట్ విస్తరణ త్వరలోనే ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఉనికి కాపాడుకునేందుకు మందస్తు రాగం తీస్తున్నారని సజ్జల విమర్శించారు
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండున్నరేళ్లకు కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ ముందే చెప్పారని తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ తమకు కీలకమేనని వెల్లడించారు. అవసరాన్ని బట్టి మంత్రులుగా ఉండే వాళ్లను పార్టీకి వినియోగించుకుంటామని చెప్పారు. శనివారం తాడేపల్లిలో వైసీపీ ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఉనికి కాపాడుకునేందుకు మందస్తు రాగం తీస్తున్నారని సజ్జల విమర్శించారు. తమకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. తగ్గించుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేయాలని.. భ్రమపెట్టాలని అనుకున్న వారే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అన్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ ఆవిర్బావ వేడుకల్లో సజ్జల మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షల దిశగా అడుగులు వేసిన పార్టీ తమదని అన్నారు. మూడేళ్ల పాలనలో.. మూడు దశబ్దాల అభ్యుదయం కనిపిస్తోందన్నారు. అది సీఎం జగన్ వల్లనే సాధ్యమైందని చెప్పారు. తమకు ప్రత్యర్థులు ఎవరూ లేరని.. ప్రజల్ని మోసం, దగా చేసే వారే ప్రత్యర్థులని చెప్పారు.సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీకి మూడింతలు చేశాడని ప్రజలు నమ్మారని.. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన విజయం అందజేశారని చెప్పారు. టీడీపీ ఏడ్పుగొట్టు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కుప్పంలో కూడా ఓడిపోయి.. నిన్న అండమాన్ గెలిచామని పండుగ చేసుకునే దుస్థితికి టీడీపీ వచ్చిందని ఎద్దేవా చేశారు.
ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలను క్షేత్ర స్థాయిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈసారి పార్టీ ప్లీనరీ జరుగుతుందని.. సభ్యత్వ నమోదు ఉంటుందని వెల్లడించారు.కరోనా కష్టకాలంలో ఆదాయం తగ్గినప్పటికీ.. ఇచ్చిన మాట కోసం వైఎస్ జగన్ కష్టపడుతున్నారని చెప్పారు. దీనిన అందరం గర్వంగా చెప్పుకోవాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందుతున్నాయో లేదో ప్రతి ఒక్క కార్యకర్త చూడాలని అన్నారు.
