నెల్లూరు: బ్యాంక్ కు వెళ్లొస్తానని భార్యతో చెప్పి వెళ్లిన యువకుడు అనుమానాస్పదస్థితిలో మరణించాడు.  కర్ణాటక రాష్ట్రంలోని రైల్వే ట్రాక్ పై యువకుడి మృతదేహం లభ్యమైంది. 

మృతుడి జేబులోని సెల్‌ఫోన్ ఆధారంగా నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన దాకా సాయినాథ్ రెడ్డిగా గుర్తించారు.కర్ణాటక పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సంగం మండలం దువ్వూరుకు చెందిన ద్వారకానాథ్ రెడ్డి, కళ్యాణి దంపతుల కొడుకు సాయినాథ్ రెడ్డి. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి హైద్రాబాద్ లో షేర్ కంపెనీని నిర్వహిస్తున్నాడు.

గత ఏడాది నవంబర్ 2న, వరంగల్ జిల్లాకు చెందిన జ్యోత్స్నతో వివాహమైంది. వీరు హైద్రాబాద్ లో నివాసం ఉంటున్నారు. చందానగర్ లోని మేనత్త గిరిజ ఇంటికి భార్యతో కలిసి ఆయన వెళ్లాడు.

భార్యను తీసుకొని కారులో దువ్వూరుకు వెళ్లాలని బంధువులకు చెప్పాడు. కంపెనీలో ఉద్యోగులకు జీతాలిచ్చి 11వ తేదీన తాను దువ్వూరుకు వస్తానని చెప్పాడు.

ఆ తర్వాత ఆయన తాను నివాసం ఉండే ఇంటికి వెళ్లిపోయాడు.ఇంటి నుండి వెళ్లిన సాయినాథ్ రెడ్డి కర్ణాటకలోని బీజాపూర్ వద్ద రైలు పట్టాలపై అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.

మృతుడి బైక్ కూడ అక్కడే ఉందని పోలీసులు చెప్పారు. బీజాపూర్ పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.