అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. వైఎస్ జగన్ పిరికివాడంటూ వ్యాఖ్యానించారు. జగన్ బలహీనుడు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం కావాలంటూ వైఎస్ జగన్ పగటి కలలు కంటున్నారంటూ విరుచుకుపడ్డారు. 

రాష్ట్రవిభజన అనంతరం 2014లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని స్పష్టం చేశారు. ప్రజల చేత ఎన్నుకున్న తెలుగుదేశం పార్టీని దెబ్బతియ్యాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీ ముసుగులో ఎన్నో అరాచకాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడిందని ఆరోపించారు. 

ఏపీకి నష్టం చేకూరేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలకు పాల్పుడుతోందని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. 

ఏప్రిల్ 11న ప్రజలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీర్పునిచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రెండు లక్షల కోట్లతో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని ఆమె ఆరోపించారు. 

రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని 18 హామీలను అమలు చెయ్యాలని చంద్రబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. 

రాష్ట్రాల అభివృద్ధి కోరుతూ చంద్రబాబు నాయుడు దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఏకతాటిపైకి తీసుకువస్తున్నారని చెప్పుకొచ్చారు. మే 23 తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి వెయ్యిశాతం నిజమన్నారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే గెలుపు అంటూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిరికోడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

జగన్ కు మోదీ అన్నా కేసీఆర్ అన్నా భయమని చెప్పుకొచ్చారు. జగన్ ఒక బలహీనుడు కాబట్టే ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ ను పావుగా చేసుకుని రాష్ట్రంలో కుట్రలు పన్నుతున్నారని సాధినేని యామిని ఆరోపించారు. 

జగన్, కేసీఆర్, మోదీలు ఎన్ని కుట్రలు పన్నినా అధికారంలోకి వచ్చేది మాత్రం తెలుగుదేశం పార్టీయేనని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీ మీడియాను కొనుగోలు చేసి దొంగ సర్వేలు ప్రకటిస్తోందని ఆరోపించారు. వైసీపీ దొంగ సర్వేలను నమ్మెుద్దని హితవు పలికారు సాధినేని యామిని.