శ్రీకాకుళం: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడు అంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాద్ధాంతంత అంతా ఇంతాకాదు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎలా సీఎస్ గా నియమిస్తారంటూ సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చుకునే పరిస్థితిలో లేని సీఎస్ కు మరో కేసు తగిలింది. తన ప్రయోజనాలకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అడ్డుతగిలారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్. 

చట్టపరంగా తనకు రావాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు. శాప్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నుంచి తనకు అందాల్సిన ప్రయోజనాలు అందకుండా ఆనాటి క్రీడా విభాగం ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం అడ్డుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బుధవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి 1వ పట్టణ పీఎస్ లో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఫిర్యాదు చేశారు. శాప్ చైర్మన్ గా తనను 2015 జనవరి 28న ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. 

ఆ పదవికి తగ్గట్టుగా గౌరవ వేతనంతోపాటు వసతి, ప్రయాణ సదుపాయాలతోపాటు సమావేశాలకు, కార్యక్రమాలకు హాజరైనందుకు తనకు ఖర్చులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ఆ బిల్లులు ఎల్వీ సుబ్రహ్మణ్యం చెల్లించలేదని ఆరోపించారు. 

తన పదవీకాలం 2017 జనవరి 28తో ముగిసిందన్న ఆయన ఇకనైనా బిల్లులు మంజూరు చెయ్యాలని కోరారు. ప్రస్తుతం ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ గా ఉన్న నేపథ్యంలో తన బిల్లులు క్లియర్ చెయ్యాలని శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ కోరారు.