చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరోషాక్ తగిలింది. చిత్తూరు జిల్లాకు చెందిన కీలక నేత టీడీపీ గుడ్ బై చెప్పేసి బీజేపీ గూటికి చేరిపోయారు. చిత్తూరు జిల్లాకు చెందిన సైకం జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. సైకం జయచంద్రారెడ్డి సివిల్ సప్లై చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికలు రావడం ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ముచ్చటగా మూడు నెలల్లోనే తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణల సమక్షంలో జయచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ జయచంద్రారెడ్డికి కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  

సైకం జయచంద్రారెడ్డితో పాటు ఐఎంఎ తిరుపతి మాజీ అధ్యక్షురాలు డాక్టర్ కృష్ణ ప్రశాంతి పలువురు ద్వితియ శ్రేణి నాయకులు బీజేపీలో చేరారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పూర్తి అయిన తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది. దాంతో ఏపీలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీ గూటికి చేరిపోయారు చేరుతున్నారు కూడా.