రైతులకు వైఎస్ జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. రైతు భరోసా పథకానికి  వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో  పరిహారం రూ.12,500 నుంచి 13,500కు చేరింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల రైతు ప్రతినిధుల హర్షం వ్యక్తం చేశారు.

అమరావతిలో వ్యవసాయ మిషన్, రైతు భరోసాపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వర్షాల ఆలస్యంతో పంటలు దెబ్బతిన్నాయని రైతు ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ఖరీఫ్ కూడా పూర్తిస్థాయిలో సాగు కాలేదని తెలిపారు. రూ.12,500 ఒకేసారి కంటే.. విడతల వారీగా ఇవ్వాలని వారు సూచించారు. మే, రబీ సమయంలో రైతుభరోసాను ఇవ్వాలని జగన్‌ను కోరారు.

కొంత మొత్తాన్ని పెంచి సంక్రాంతికి ఇవ్వాలన్నారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మే నెలలో రూ.7,500 ఖరీఫ్, రబీ అవసరాల సమయంలో రూ.4 వేలు, సంక్రాంతి పండుగ సమయంలో రూ.2 వేలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు తయారు చేయాల్సిందిగా ఆయన సూచించారు. 

నికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు తెలిపారు. నవంబర్ 15 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని కన్నబాబు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటసీ, జడ్పీ ఛైర్మన్లతో పాటు మాజీలకు కూడా పథకం అమలవుతుందన్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు రైతు భరోసాకు అనర్హులని కన్నబాబు ప్రకటించారు. పిల్లలు ప్రభుత్వోద్యోగులుగా ఉండి.. వ్యవసాయం చేస్తున్న తల్లిదండ్రులు కూడా రైతు భరోసాకు అర్హులేనని మంత్రి స్పష్టం చేశారు. అర్హత గల రైతు మృతి చెందితే అతని భార్యకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.