సాధారణ ప్రయాణీకుడి వద్ద దాదాపు రెండు కోట్ల నగదు దొరికిన సంఘటన ఇప్పుడు కర్నూలులో కలకలం రేపుతోంది. ఓ బ్యాగులో తరలిస్తున్న భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే...

పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఈబీ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. వాహనాల తనిఖీలో భాగంగా సీఐ లక్ష్మీ దుర్గయ్య కుప్పం ఆర్టీసీ డిపో బస్సును నిలిపారు. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. అందులో ఓ బ్యాగులో రూ.1.90 కోట్ల నగదు లభించింది. వెంటనే ఆ వ్యక్తిని తాలుకా పోలీసులకు అప్పగించారు. 

కర్నూలు డీఎస్పీ మహేష్‌, తాలుకా సీఐ ఓబులేసు, సీఐ లక్ష్మీ దుర్గయ్య ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో భారీగా నగదు తరలిస్తున్న అనంతపురం నగరంలోని మారుతీ నగర్‌కు చెందిన రామచౌదరిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు.

పట్టుబడిన నగదు గుంతకల్లు పట్టణానికి చెందిన రంగనాయకులు నాయుడు అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి చెందినదని రామచౌదరి తమ విచారణలో వెల్లడించాడని తెలిపారు. రంగనాయకులు నాయుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి రామచౌదరి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. 

హైదరాబాదు నగరంలో ఓ పొలం కొనుగోలు కోసం రూ.1.90 కోట్ల నగదును తీసుకెళ్లారు. అక్కడ డీల్‌ కుదరకపోవడంతో నగదును వెనక్కు తీసుకువెళుండగా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.  నగదుకు ఎలాంటి ఆధారాలూ చూపలేదని, అందుకే ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని అన్నారు. 

ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో నగదు లభ్యమైందని తెలిపారు. సీఐని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, ఖాజావళి తదితరులు పాల్గొన్నారు