జైల్లో చంద్రబాబు: సూపరింటిండెంట్ రాహుల్ సెలవుపై అనుమానాలు
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఉంచిన రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటిండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ నాలుగు రోజుల పాటు సెలవుపై వెళ్లారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్న రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ సెలవుపై వెళ్లడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నాలుగు రోజుల పాటు సెలవుపై వెళ్తున్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఆయన సెలవులో ఉంటారు.
భార్య అనారోగ్యానికి గురి కావడంతో దగ్గర ఉండి చూసుకోవాల్సి రావడంతో రాహుల్ సెలవు పెట్టారని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ నాలుగు రోజుల పాటు జైళ్ల శాఖ కోస్తాంధ్ర ప్రాంత డిఐజీ రవికిరన్ జైలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. చంద్రబాబును జైలుకు తెచ్చిన రోజునే రాహుల్ కు నోటీసులు ఇచ్చారని, బదిలీ చేశారని, సస్పెండ్ చేశారనే ఊహాగానాలు చెలరేగాయి.
చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భద్రతపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. డిఐజీ రవికిరణ్ 12వ తేదీ రాత్రి జైలులో తనిఖీలు నిర్వహించారు .13వ తేదీన మరోసారి ఎస్పీ జగదీశ్ తో కలిసి చంాద్రబాబు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో రాహుల్ సెలవు పెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి ములాఖత్ లో భాగంగా చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్, టిడిపి ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిశారు. మరోసారి చంద్రబాబుతో ములాఖత్ కోసం భువనేశ్వరి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని అధికారులు తిరస్కరించారు.