చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. 

అసెంబ్లీలోనూ, బయట అధికార తెలుగుదేశం పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. అంతేకాదు ఎన్నికలకు ముందు వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హోదాలు రాష్ట్రమంతా ఓ రౌండే చుట్టేశారు. 

మహిళల ఓట్లను వైసీపీవైపు ఆకర్షించేందుకు టీడీపీ హయాంలో మహిళలపై జరిగిన దాడులను, అఘాయిత్యాలను ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు చెల్లెమ్మగా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా నిలిచిపోయారు రోజా. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మళ్లీ నగరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే రోజాకు హోంమంత్రి పదవి కన్ఫమ్ అంటూ తెగ ప్రచారం జరిగిపోతుంది. 

ఇప్పటికే నగరినియోజకవర్గ ప్రజలతోపాటు, రాష్ట్రంలోని వైసీపీ నేతలు, రోజా అభిమానులు వైసీపీ అధికారంలోకి వస్తే తమ నటి మంత్రి అవుతందంటూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మంత్రి పదవికి రోజా అర్హురాలు కూడా. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అలుపెరగని పోరాటం చేశారు. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో జైల్లో ఉన్న సమయంలో రోజా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో దూసుకెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతుంది. 

కానీ అయితే రోజాకు మంత్రి పదవి దక్కాలంటే ఇద్దరు ఉద్దండులను వెనక్కి నెట్టాల్సిన పరిస్థితి ఉందని అంత సామర్థ్యం రోజాకు ఉందా అంటూ వైసీపీలో ప్రచారం జరుగుతుంది. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 

రాష్ట్రంలో కీలక నేతగా వైఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడుగా ఎదిగాడు ఆయన తనయుడు మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్తే అదే వేదం. అందుకే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కూడా వైఎస్ జగన్ కంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కీలకంగా వ్యవహరించారంటూ ప్రచారం జరుగుతుంది. 

ఇకపోతే వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు ఈసారి మంత్రి పదవి దక్కడం ఖాయమంటూ ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేతల్లో ఈయన ఒకరు. 

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చిత్తూరు జిల్లాలో అలుపెరగని పోరాటం చేశారు. పలుమార్లు జైలుకు సైతం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీకి చేసిన సేవకు గానూ ఈయనకు మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం జరుగుతుంది. 

చిత్తూరు జిల్లాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించడమే కాదు వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఈ ముగ్గురికి మంచి పేరుంది. వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా పిలిచే చెల్లి రోజ ఒకరైతే పార్టీకోసం సర్వం ధారపోసిన వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 

ఈ ముగ్గురు మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి మాత్రమే మంత్రి వర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. అలాగని రెండు మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గానికే కేటాయిస్తే కాస్త విమర్శలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. 

అయితే రోజా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతే అయినప్పటికీ ఆమెకు మహిళా కోటాలో ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనప్పటికీ రోజాకు మంత్రి పదవి దక్కాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలలో ఎవరో ఒకరు పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

అంటే రోజా మంత్రి పదవికి అడ్డుపడబోయేది ఈ ఇద్దరు నేతలేనని ప్రచారం జరుగుతోంది. ఒక మహిళా అయి ఉండి అధికార పార్టీపై అలుపెరగని పోరాటం చేశారు రోజా. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ మహిళా ఓటర్లను వైసీపీకి చేరువ చేసే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. 

పార్టీ కార్యక్రమాలను విజయవంతం చెయ్యడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాలన్నింటిని వైఎస్ జగన్ పరిశీలిస్తే కచ్చితంగా మంత్రి పదవి ఖాయమంటూ తెగ ప్రచారం జరిగిపోతుంది. మరి వీరిభవితవ్యంపై వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.