అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి. వైయస్ జగన్ కేబినెట్ కూర్పు దగ్గర నుంచి ఆయన ప్రవేశపెడుతున్న పథకాల వరకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కానీ నగరి ఎమ్మెల్యే రోజాకు కేబినెట్ లో స్థానం కల్పించకపోవడంపై మాత్రం నేటికి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆమెను బుజ్జగించేందుకు ఆ పదవి ఇస్తారు ఈ పదవి ఇస్తారంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఎలాంటి పదవి ఇవ్వలేదు వైయస్ జగన్. 

సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆర్ కే రోజా మంత్రి పదవికి దూరమవ్వాల్సి వచ్చింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసిన తర్వాత జగన్ కేబినెట్ లో రోజా మంత్రి అని కొంతమంది హోంశాఖమంత్రి అంటూ మరికొందరు ఇలా నానా ప్రచారం చేశారు. 

ఎప్పుడైతే కేబినెట్ లో బెర్త్ దక్కలేదో ఆమెపై విపరీతమైన సానుభూతి పెరిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు రోజా. ఆమె టీడీపీపై చేసిన విమర్శలకు ప్రజలు ఫిదా అయ్యారంటే మామూలు విషయం కాదు. 

అసెంబ్లీ సమావేశాల్లో రోజా పదేపదే ప్రస్తావించిన మాట కాల్ మనీ సెక్స్ రాకెట్. సెక్స్ రాకెట్ పై పోరాడుతున్నాననే నెపంతో తనను ఏడాది పాటు సస్పెన్షన్ కు గురి చేశారంటూ ఆమె వాపోయారు. మానసికంగా ఎంతో క్షోభకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులు మూసి వేయించడం దారుణమని బాధితులకు న్యాయం జరగలేదంటూ ఆమె ధ్వజమెత్తారు. 

అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్లు, పోలీసుల సమావేశంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ చోటు చేసుకోవడం దారుణమన్నారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో ఎంతటి పెద్దవారు ఉన్నా వదలొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే రోజా తెగ సంబంరపడిపోతున్నారని తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా కనీసం తన పంతాన్నైనా జగన్ నెరవేరుస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారట. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఇరుక్కుని ఎంతోమంది మహిళలు తమ జీవితాలను నాశనం చేసుకున్నారని వారికి న్యాయం చేసేందుకు వారి తరపున తాను పోరాటం చేశానని గుర్తు చేశారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడుతున్న తనను అధికారాన్ని అడ్డుపెట్టుకుని అకారణంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారని ఆమె వాపోయిన సంగతి తెలిసిందే. 

అంతేకాదు తన సస్పెన్షన్ ను నిరసిస్తూ ఆమె అసెంబ్లీ దగ్గర సొమ్మసిల్లి పడిపోవడం కూడా జ రిగింది. అసెంబ్లీ ప్రాంగణంలోనే నిద్రకు ఉపక్రమించి నిరసన తెలిపినా స్పీకర్ స్పందించకపోవడంపై ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మెుత్తానికి తాను చేసిన పోరాటానికి జగన్ గౌరవిస్తూ కాల్ మనీ సెక్స్ రాకెట్ పై విచారణకు ఆదేశించడంపట్ల ఆమె మాత్రం మంచి హుషారుగా ఉన్నారట. మంత్రి పదవి ఎలా ఉన్నా కానీ తన పంతం మాత్రం నెరవేరుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని ఆమె విశ్వసిస్తున్నట్లు సమాచారం.