భారీ వర్షాలతో కృష్ణా జిల్లా అతలాకుతలం అవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.  ఈ వర్షాల కారణంగా విజయవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇవాళ ఇంద్రకీలాద్రి కొండ చరియలు విరిగి చిన్న గాలిగోపురం దగ్గరున్న  క్యూలైన్ పై పడ్డాయి. అయితే ఈ సమయంలో క్యూలైన్లో భక్తులెవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ వర్షాలతో ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారిందని అందువల్ల మూడు రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే నగరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు లంక గ్రామాలు, నదీ తీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా అపాయం పొంచివున్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కాలువలకు గండ్లు పడుతూ గ్రామాలను ముంచెత్తుతున్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో 70 గేట్లెత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని మునేరు, వైరా నదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.