అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత దాదాపు పూర్తి కావస్తోంది. ప్రజావేదిక అక్రమ కట్టడమని నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్మించారంటూ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. 

సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో సీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలో ప్రజావేదికను కూల్చివేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నానికి మెుత్తం ప్రజావేదిక నేలమట్టం కాబోతుంది. ప్రజావేదికను కూల్చివేస్తున్న సందర్భంగా అక్కడికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

ప్రజావేదిక వద్దకు వెళ్లే రోడ్డు తమ భూముల్లో వేశారంటూ రైతులు ఆరోపించారు. రోడ్డును తొలగించి తమ భూములు తమకు అప్పగించాలని రైతులు కోరుతున్నారు. ఒప్పంద పత్రాలు తీసుకువచ్చిన రైతులు ప్రకాశ్, సాంబశిరావు.   

ఇకపోతే ప్రజావేదిక రోడ్డు తొలగిస్తే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాకపోకలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు సైతం ఇదే రోడ్డు నుంచి తన నివాసానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రోడ్డుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరోవైపు చంద్రబాబు నాయుడు నివాసం కూడా కూల్చివేస్తామంటూ రాష్ట్రప్రభుత్వంలోని పలువురు మంత్రులు చెప్తున్న పరిస్థితి.