అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెదవడుగూరు మండలం గుత్తిఅనంతపురం గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు రైతులు పని నిమిత్తం అనంతపురం వచ్చారు. డోన్ వరకు రైలులో వచ్చిన వారు అక్కడి నుంచి అనంత వెళ్లేందుకు ఓ అంబులెన్స్ ఎక్కారు.

గుత్తిఅనంతపురం వద్ద వేగంతో వెళ్తున్న అంబులెన్స్‌ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.