అనంతపురం: లాక్ డౌన్ సమయంలో వైద్యం కోసం ఏపి నుండి  కర్ణాటకకు వెళ్లిన ఓ గర్భిణితో పాటు ఆమె భర్త మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దంపతుల మృతితో వారి ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. ఇలా రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకోవడమే కాదు అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేసింది. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూర్ మండలం బోడిసానిపల్లి తండాకు చెందిన కేశవనాయక్-వరలక్ష్మీబాయి దంపతులకు ఇద్దరు సంతానం. ఆమె ప్రస్తుతం  మూడు నెలల గర్భంతో వుంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్యంకోసం దగ్గర్లోని బళ్లారికి తీసుకెళ్లాడు భర్త. నాలుగు రోజులు అక్కడే వుండి ఆదివారం  తిరిగి తమ స్వగ్రామానికి బయలుదేరారు.  

ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టడంతో గర్భిణి లక్ష్మీబాయి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన భర్త అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. దీంతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.

ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. తమ తల్లిదండ్రులకు ఏమయ్యిందో కూడా తెలియని ముక్కుపచ్చలారని ఆ ఇద్దరు చిన్నారులను  చూసి జాలిపడని వారు లేరు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా  విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.