కడప: కడప జిల్లా ఎర్రగుంట్లలో రిటైర్డ్ ఉద్యోగి వెంకటరమణయ్య అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. మాజీ మున్సిపల్ ఛైర్మెన్ ముసలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ముసలయ్య ఇంట్లో మొండెం లేని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మృతదేహానికి సంబంధించిన తలను కడప జిల్లాలోని గువ్వల చెరువుఘాట్ వద్ద  లోయలో ఓ టిఫిన్ బాక్స్ లో గుర్తించారు.నిందితుడి  ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు  టిఫిన్ బాక్సులో మొండెం నుండి వేరు చేసిన తలను స్వాధీనం చేసుకొన్నారు. 

వెంకటరమణయ్య కన్పించడం లేదని ఈ నెల 22వ తేదీన  కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక లావాదేవీల మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

డెడ్ బాడీ నుండి తలను వేరు చేసి ఇతర ప్రాంతానికి టిఫిన్ బాక్సులో తీసుకెళ్లడమంటే హత్యలో ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలతోనే ఈ హత్య  పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వెంకటరమణయ్య వద్ద చాలా మంది అప్పులు తీసుకొన్నారని చెబుతున్నారు. ముసలయ్య కూడ ఆయన వద్ద డబ్బులు అప్పుగా తీసుకొన్నాడని పోలీసులు చెబుతున్నారు. వెంకటరమణయ్య చెప్పిన చోటే టిఫిన్ బాక్సులో డెడ్ బాడీ తల లభ్యమైందని పోలీసులు చెప్పారు. అయితే ఈ హత్య కేసు విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.