విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పునఃనిర్మించిన పవిత్ర పుణ్యక్షేత్రం కోదండరామాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్ పాల్గొన్నారు. 

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పునఃనిర్మించిన పవిత్ర పుణ్యక్షేత్రం కోదండరామాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్ పాల్గొన్నారు. నీలాచలం కొండపై ఉన్న పురాతన కోదండరాముని ఆలయంలో సీతారాముల విగ్రహాలను 2020 డిసెంబర్‌లో దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున భక్తులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నీలాచలం కొండ వద్ద నిరసనలు చేపట్టారు. 

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 3 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో గతేడాది డిసెంబర్‌లో నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నీలాచలం కొండపై పూర్తిగా రాతి కట్టడాలతో ఆలయాన్ని నిర్మించారు. 

ఇక, ఆలయంలోని విగ్రహాలు ధ్వంసం అయిన కొద్ది రోజులకు టీటీడీ శిల్ప కళాకారుల తయారు చేసిన సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామతీర్ధం తీసుకువచ్చి దేవాలయం దిగువననున్న బాలలయంలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్టించారు. నిత్య పూజలు జరుపుతున్నారు. కొండపై ఆలయ నిర్మాణ పనులు పూర్తికావడంతో అక్కడ పున: ప్రతిష్ఠించారు. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు గైర్హాజరయ్యారు. ఇది కాస్తా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు అతిథులందరికీ కొద్ది రోజుల క్రితం ఆహ్వానాలు పంపారు. రామతీర్థం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజుకు కూడా ఆహ్వానం పంపినట్టుగా తెలుస్తోంది. అయితే శంకుస్థాపన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నేటి కార్యక్రమానాకి హాజరు కాలేదనే ప్రచారం జరుగుతుంది. 

శంకుస్థాపన సమయంలో.. 
గతేడాది డిసెంబర్ 22న రామతీర్థం ఆలయం శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలఫలకాన్ని కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజుతొలిగించడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది. ఈ క్రమంలోనే అశోక్ గజపతిరాజు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శంకుస్థాపన కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆలయ నిబంధనల ప్రకారం శిలాఫలకం, శంకుస్థాపన కార్యక్రమం గురించి తనకు ముందుగా తెలియజేయలేదని అశోక్ గజపతిరాజు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ను విస్మరించి సంప్రదాయాలు, సంస్కృతికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్ణయించే ముందు ఆలయ కమిటీని సంప్రదించలేదన్నారు. ఇక, శంకుస్థాపన కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టేందుకు వచ్చిన ఆహ్వానాన్ని కూడా అశోక్ తిరస్కరించారు. ధర్మకర్త మాత్రమే పూజలు చేసి శంకుస్థాపన చేయాల్సి ఉందని వాదించారు. 

మరోవైపు అశోక్ గజపతిరాజ్ తీరుపై అప్పటి రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. రామతీర్థం ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఇక, అశోక్ కుటుంబం గత వందల ఏళ్లుగా ఆలయానికి అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నారు.