Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు... వైసిపి సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు

ప్రభుత్వ భవనాలకు ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగుల విషయంపై విచారించిన ఏపి హైకోర్టు జగన్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. 

Remove party colours from govt buildings: HighCourt Serious on Jagan's Government
Author
Amaravathi, First Published Apr 17, 2020, 10:23 AM IST

అమరావతి: ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల తొలగింపు కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురయ్యింంది.  రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగులు తొలగించేందుకు మూడు నెలల సమయం కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. మూడు నెలల గడువు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. 

దీంతో పంచాయతీ భవనాలకు కొత్త రంగులు వేసేందుకు ఎంత సమయం పడుతుందో సోమవారం రోజున చెబుతామని న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

గతంలోనూ పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టడంతో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ  పిటిషన్ పై   విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం వైసిపి ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ పిటిషన్ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వం ఏపి హైకోర్టు ఆదేశాలను సమర్ధించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా? అంటూ న్యాయమూర్తి ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. కాబట్టి ఇలాంటి చర్యలను సమర్ధించబోమని... వెంటనే హైకోర్టు తీర్పును అమలుచేసి తీరాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ పిటిషన్  కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం. 

 పంచాయతీ రాజ్ కార్యాలయాలపై వైసిపి రంగులు వేయడంపై అంతకుముందు హైకోర్టు మండిపడింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులపై ప్రభుత్వ తీరును హైకోర్టు ఆక్షేపించింది.  ముఖ్యంగా పంచాయతీ కార్యాలయపై సీఎం ఫొటో ఎందుకు ముద్రించారని హైకోర్టు ప్రశ్నిస్తే రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారు కాబట్టి ముద్రించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలంటే కార్యాలయం లోపల సీఎం ఫొటో పెట్టుకోవచ్చునని హైకోర్టు చెప్పింది.

 పార్లమెంటుపై ప్రధాని ఫొటోను, సుప్రీంకోర్టుపై ప్రధాన న్యాయమూర్తి ఫొటోను ముద్రించారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి సంప్రదాయం ఎక్కడుందో చెప్పాలని నిలదీసింది.  వైసీపీ రంగులు వేరు, కార్యాయాలకు వేసిన రంగులు వేరని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పగా తాము వాటిని పోల్చుకోగలమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో టీడీపీ, వైసీపీ జెండాలను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇలా ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులను తొలగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా చుక్కెదుకయ్యింది. దీంతో వైసిపి ప్రభుత్వం పార్టీ రంగుల విషయంలో వెనక్కితగ్గాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ రంగులు ఎప్పటిలోగా తొలగిస్తారో చెప్పాలని తాజాగా హైకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios