అమరావతి: మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన పాటించిన విలువలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నీలం సంజీవరెడ్డికి నివాళులు అర్పించారు. 

భారత రాష్ట్రపతిగా మరెన్నో పదవులలో సేవలందించిన తెలుగువెలుగు, కీర్తిశేషులు నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా.. ఆయన జీవితంలో పాటించిన విలువల గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చంద్రబాబు అన్నారు. 

సీఎంగా ఉన్నప్పుడు హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించి పదవినే వదిలేసిన సంజీవరెడ్డి. తాను లోక్‌సభ సభాపతిగా ఎన్నిక కాగానే, నిస్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో... తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి విలువలకు పట్టంకట్టారని అన్నారు. 

కాబట్టే భారత రాష్ట్రపతి పదవికి సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గుర్తు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మరి ఈనాడు గౌరవ పదవుల్లో ఉన్నవారు కోర్టులు ఒకసారి కాదు 65సార్లు తప్పుపట్టినా దులిపేసుకోవడం శోచనీయమని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు.  

కోర్టుల వ్యాఖ్యలనే కాదు, తీర్పులను  లెక్కపెట్టని పెడ ధోరణి చూస్తున్నామని, పైగా కోర్టులకే దురుద్దేశాలు ఆపాదించే  హీనానికి దిగజారడం బాధేస్తోందని చంద్రబాబు జగన్ తీరుపై వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో "నీలం" లాంటి నాయకుల స్మృతులను మననం చేసుకోవాల్సిన సందర్భం ఇది అని ఆయన అన్నారు.