ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ మహిళను సొంత బంధువులే అతి కిరాతకంగా ప్రవర్తించారు. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ సంఘటన రాజమహేంద్రవరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక కొంతమూరు ప్రాంతానికి చెందిన ముత్యాల పాపారావు, అర్చన దంపతులు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో పొరుగు సేవల్లో పనిచేస్తున్నారు.

వీరికి ముగ్గురు సంతానం. అర్చన తల్లిదండ్రులు ఇటీవల కరోనా సోకి మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి అర్చనకు, ఆమె  చెల్లెలు అశ్వినికి  తల్లిదండ్రుల ఆస్తి విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. నగరంలోని శంభునగర్ లో నివసిస్తున్న అశ్విని సోమవారం ఆస్తి లావాదేవీలు మాట్లాడేందుకు అర్చనను తన ఇంటికి పిలిచింది.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. దీంతో.. అశ్విని, ఆమె భర్త రాజేంద్ర ప్రసాద్, అతని సోదరుడు ఆంటోనీ అర్చనపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. అనంతరం ఆస్పత్రిలో  చేర్పించారు. కాగా.. తనపై తన సొంత చెల్లెలు ఆమె బంధువులే హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ అర్చన ఆస్పత్రిలో పోలీసులకు వాగ్మూంలం ఇవ్వడం గమనార్హం.

ప్రస్తుతం అర్చన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దాదాపు 80శాతం ఆమె శరీరం కాలిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.