అభం, శుభం తెలియని ఓ విద్యార్థినిపై సొంత బంధువే కన్నేశాడు. మాయ మాటలు చెప్పి విద్యార్థినిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబితే.. చంపేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే... అనుకోకుండా బాలిక గర్భం దాల్చింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తుర్లపాడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తుమ్మల చెరువు గ్రామానికి చెందిన బాలికన బంధువైన ఖాశీం వలీ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి అప్పటికే వివాహమైనప్పటికీ బాలికపై కన్నేసి లోబరుచుకున్నాడు.

అయితే.. ఇటీవల బాలిక గర్భం దాల్చింది. ఆమె శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో.. బాలిక అసలు విషయం బయటపెట్టింది. ఖాశీం తనపై అత్యాచారం చేసి.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని.. అందుకే చెప్పలేదని బాలిక వాపోవడం గమనార్హం.

కాగా... బాలిక, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.