కడప: శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ భాస్కరన్ ను పోలీసులు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు కోటి విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పక్కా సమాచారంతో భాస్కరన్ ను శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఓఎస్డీ దేవప్రసాద్‌ వెల్లడించారు. 

భాస్కరన్ ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం శేషాచలం అడవులను నాశనం చేశాడు. అడవిలోని ఎర్రచందనం చెట్లను నరికించి తమిళనాడు, కర్ణాటక మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఈ స్మగ్లింగ్ కు సంబంధించి అతడిపై 21 కేసులున్నాయి. ఈక్రమంలో అతడి కోసం ముమ్మర గాలింపు చేపట్టిన కడప పోలీసులు చివరకు అతడిని అరెస్ట్ చేశారు. భాస్కరన్ అందించిన సమాచారం మేరకు మరో 16మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.  

అతడి నుండి రూ.కోటి విలువైన 1.3 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఓ తుపాకీ, కొన్ని బుల్లెట్లు, 290 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.