వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. వారి పెళ్లికి పెద్లలు నిరాకరించడంతో.. ఎదురించి మరీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రశాంతంగా సాగుతున్న వారి సంసారంలో చిన్న మనస్పర్థ చోటుచేసుకుంది. దాని కారణంగా క్షిణాకావేశంలో ఇద్దరూ తప్పు చేశారు. దాని ఫలితంగా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వరరావు (24), నవాబుపేటకు చెందిన శ్రావణి (21) ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2019 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వెంకటేశ్వరరావు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఉదయం తన పుట్టింటికి వెళ్లి వస్తానని శ్రావణి భర్త వెంకటేశ్వరరావును కోరింది. భర్త నిరాకరించటంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. క్షణికావేశంలో శ్రావణి ఇంటిలోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త వెంకటేశ్వరరావు హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాడు. 

ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో తట్టుకోలేని వెంకటేశ్వరరావు ఈ నెల 11న గుంటూరు ప్రభుత్వాస్పత్రి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

 గమనించిన స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. కాగా శ్రావణి శుక్రవారం ఉదయం మృతిచెందగా వెంకటేశ్వరరావు శుక్రవారం సాయంత్ర తుది శ్వాస విడిచాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.