రాజమండ్రి:  కట్టుకొన్న భార్య, కొడుకులు,  బావమరిది కలిసి రియల్టర్‌ను  అతి కిరాతకంగా  నరికి చంపారు. ఆర్థిక వివాదాలే  ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన రాజమండ్రిలో చోటు చేసుకొంది.

 రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట సావిత్రీనగర్‌లోని  బాలాజీ టవర్స్‌లో  వెలగల పట్టాభిరామిరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. మృతుడికి  భార్య, ముగ్గురు కొడుకులున్నారు. ఆర్థిక వివాదాల కారణంగానే పట్టాభిరామిరెడ్డి దూరంగా ఉంటున్నారు. 

మూడు మాసాల క్రితం హుకుంపేట పంచాయితీ పరిధిలోని బాలాజీ టవర్స్ లో ఫ్లాట్ నెంబర్ 203లో అద్దెకు ఉంటున్నారు.   ఈ విషయం తెలుసుకొన్న పట్టాభిరామిరెడ్డి భార్య సూర్యరాణి, కొడుకులు యోగా తేజ రెడ్డి, డోలా తేజరెడ్డి, బావమరిది కృష్ణారెడ్డి ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో  అపార్ట్‌మెంట్‌కు వచ్చారు.

అర్దరాత్రి పూట పట్టాభిరామిరెడ్డి ఇంటి తలుపులు కొట్టారు. అయితే తలుపులు తెరిచిన పట్టాభిరామిరెడ్డి ఎదురుగా మారణాయుధాలతో ఉన్న కుటుంబసభ్యలను చూసి తలుపులు వేసుకొన్నారు. అయితే కిటికీలు పగులగొట్టి నిందితులు తలుపులు తీసుకొని ఇంట్లోకి వెళ్లారు. తమ వెంట తెచ్చుకొన్న మారణాయుధాలతో పట్టాభిరామిరెడ్డిని హత్య చేశారు.

ఆర్థిక వివాదం నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గతంలోనే  పరస్పరం కేసులు పెట్టుకొన్నారు. పట్టాభిరామిరెడ్డికి నేర చరిత్ర ఉన్నట్టుగా  పోలీసులు చెబుతున్నారు. 1992 నుండి 94 మధ్యలో ఆయనపై బైకులు, కార్లు దొంగతనం చేసినట్టుగా  కేసులున్నాయి. 2005లో ముదునూరుపాడులో బోగస్ బీఈడీ కాలేజీ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు.  2007లో మల్లిడి శ్రీనివాస్ రెడ్డిని ఆర్థిక వివాదాల నేపథ్యంలో పాయిజన్ ఇచ్చి హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2009లో కూడ ఓ కాలేజీ ప్రిన్సిఫాల్ ను పాయిజన్ ఇచ్చి చంపారని అభియోగాలు ఉన్నాయి