గుంటూరు: కరోనా మహమ్మారి రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న వేళ ప్రజలకు భరోసా ఇచ్చేలా సాగాల్సిన జగన్ పరిపాలన గుడ్జెద్దు చేలో పడినట్లుగా ఉందని మాజీ  ఎంపీ  రాయపాటి సాంబశివరావు విమర్శించారు. ప్రతి విషయంలో ఒక కులం అని అంటూ తెగ గోల చేస్తున్నారని... వైసీపీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అన్ని ఆ కులం మీద వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని రాయపాటి మండిపడ్డారు. 

గతంలో ఏమోగానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం కేవలం ఒక్క రెడ్డి కులాన్ని మాత్రమే పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ఆ కులం వారికి తప్పిస్తే మిగతా ఏ ఒక్క కులానికి  పోస్టింగ్స్ ఇవ్వటం లేదని అన్నారు. అయినా దీనిపై ముఖ్యమంత్రిని ప్రశ్నించడం కాదు కనీసం నోరెత్తి అడిగే వారే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేరని  రాయపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కమ్మ కులానికి చెందిన వారు అని తెలిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీసి పక్కన పడేస్తున్నారని... ప్రమోషన్స్ ఇవ్వాల్సిన వారికి డిమోషన్ చేస్తున్నారని అన్నారు. 
ఇది మంచిది పద్దతికాదని అన్నారు. వైసీపీ  చేసే ప్రతి కుట్రను కమ్మ కులంపై నెట్టేస్తే సరిపోతుందన్న ప్లాన్లో ఆ పార్టీ శ్రేణులు వున్నాయని అన్నారు. రేపు హత్య లు జరిగిన కూడా ఇది ఒక కులం వారే చేశారనే స్థాయికి వైసిపి అరాచకాలు చేరాయని అన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ కనీసం మంత్రులకు కూడా అందుబాటులో ఉండటం లేదని అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు అయితే సగం మంది కూడా ఇంకా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 

హడావుడిగా ఎన్నికల కమిషనర్ ను మార్చడం మంచిది కాదన్నారు.  మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ పై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడటమే కాదు  ఆయన కూతురు, భార్య పేర్లు సోషల్ మీడియా లో పెట్టే విష సంస్కృతిని వైసిపి వాళ్లు తీసుకుని వచ్చారని మండిపడ్డారు. వీరు విమర్శిస్తున్న రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయకపోతే కరోనా మరింత విజృంభించి వేల మంది చనిపోయేవారని... రాష్ట్ర ప్రజలను కాపాడిన ఇలాంటి వ్యక్తిని జగన్ అవమానకరంగా తొలగించడం హేయమైన చర్య అని అన్నారు.  

కరోనాను సీఎం జగన్ చాలా ఈజీగా తీసుకుంటున్నారని... ఏకంగా వైసిపి ఎమ్మెల్యే ముస్తఫానే క్వారంటైన్ లో ఉన్నా ఈ వైరస్ తీవ్రతను ఆయన అర్థం  చేసుకోలేకపోతున్నాడని అన్నారు. కరోనా తగ్గిన తరువాత అమరావతి విషయంలో ప్రధాని తో మాట్లాడతానని అన్నారు.  రాజదాని మార్పు తో వైసిపి జీరో అవుతుంది. ఎప్పుడు ఎన్నికల జరిగినా వైసిపి  ఓటమి ఖాయమని రాయపాటి జోస్యం చెప్పారు.