అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవో వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాయలసీమ పరిరక్షణ సమితి నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. మాజీ మంత్రి డాక్టర్ ఎంవీ మైసురారెడ్డి, గుంగుల ప్రతాపరెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీజీపీలుగా పనిచేసిన ఆంజనేయరెడ్డి, దినేష్ రెడ్డిలతో పాటు 16 మంది రాయలసీమ నేతలు ఆ లేఖ రాశారు. 

రాయలసీమకు గోదావరి జలాలను తీసుకుని వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చెప్పడాన్ని వారు అభినందించారు. కేసీఆర్ ప్రకటనపై సీఎం జగన్ చొరవ తీసుకుని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీనీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు చేస్తూ చట్టబద్దత కల్పించాలని అన్నారు. 

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాయలసీమ మెడపై కత్తిలాంటిదని వారన్నారు. ఆ తీర్పు అమలులోకి వస్తే రాయలసీమ ప్రాజెక్టులు వృధా అవుతాయని వారన్నారు. తెలుగు గంగకు 25 టీఎంసీల నీరు కేటాయించారని చెబుతూ హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీరు కేటాయించలేదని అన్నారు. ఆ తీర్పు వస్తే ఈ ప్రాజెక్టులు నిరర్థకంగా మారిపోతాయని వారన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముందున్న ప్రత్యామ్నాయం గోదావరి జలాలే అని, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల ద్వారా ఆదా అయ్యే నీటిని   రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి చట్టబద్ధత కల్పించాలని వారన్నారు. అది తప్ప మరో దారి లేదని అన్నారు. అది చేసిన తర్వాతనే పోతిరెడ్డిపాడు సామర్థ్యంపై ఆలోచన చేయాలని అన్నారు. 

పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు గత రెండేళ్లుగా తరలిస్తున్న విషయం వాస్తవమని, ఆ మేరకు కృష్ణా జలాలు అదా అవుతున్నాయని, ఆదా అవుతున్న కృష్ణా జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలని, అందుకు శాసనసభలో చట్టబద్దత కల్పించాలని వారు చెప్పారు.