కడప: ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో మరో వైసీపీ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆయన ఇక రంగంలోకి దిగారు. గ్రామ ప్రజలతో కలిసి ఆయన డ్రైనేజీ బాగు చేసేందుకు రంగంలోకి దిగారు. 

అంతేకాదు నియోజకవర్గం పరిధిలోని పేరుకుపోయిన డ్రైనేజీలను శుభ్రం చెయ్యాలని ఆదేశించారు. అందుకు సంబంధించి వ్యయాన్ని తానే భరిస్తానని హమీ ఇచ్చారు. అనుకున్నదే తడవుగా జేసీబీలను, ట్రాక్టర్లను ఏర్పాటు చెయ్యించారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారా..కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. 

పట్టణంలో పారిశుధ్యం చాలా అధ్వాన్నంగా ఉందని , కాలువల్లో చెత్త పేరుకుపోయిందని మురుగునీరు రోడ్లపైకి ప్రవహించడంతో దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాయచోటి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజల సహకారంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చీపురు పట్టారు. రోడ్లు ఊడ్చారు. డ్రైనేజీలో ఉన్న మురుగును కూడా తొలగించారు. ఎమ్మెల్యే చీపురు పట్టిన విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ నసిబున్ ఖానం స్పందించారు. 

ఎమ్మెల్యే తోపాటు ఆయన తన సొంత సొమ్ములతో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే డ్రైనేజీలు బాగు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గతంలో నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం నిరసనకు దిగారు. 

మురుగు కాల్వలోకి దిగి వంతెన కోసం దీక్ష చేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం సమస్యను పరిష్కరించింది. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే చీపురు పట్టడం అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.