అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో చౌక దుకాణాల ద్వారా పేదలకు రేషన్ పంపిణీ కొనసాగుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 42 మండలాల్లో కరోనా రెడ్ జోన్లు ప్రకటించగా 
ఈ ప్రాంతాల్లోని కార్డుదారులకు సరుకులు డోర్ డెలివరీ చేస్తున్నారు వాలంటీర్లు. రెడ్ జోన్లలో రేషన్ కోసం పేదలు బయటకు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పేదల ఇంటి వద్దకే వెళ్లి ఉచిత బియ్యం, శనగలు అందజేస్తున్నారు. ఇలా కరోనా నిబంధనలకు పకడ్భందీగా అమలు చేస్తోంది ఏపి ప్రభుత్వం. 

గురువారం ఉదయం నుంచే కూపన్లు తీసుకున్న కుటుంబాలకు కేజీ శనగలు, ఒక్కో సభ్యుడికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా అందచేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా  1,47,24,017 కుటుంబాలకు లబ్ది జరిగేలా ముఖ్యమంత్రి ఆదేశించారు.  అందరూ ఒకేసారి రేషన్ షాప్ లోకి రాకుండా సమయాలను సూచిస్తూ కూపన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు.

తమకు ఇచ్చిన కూపన్ లోని సమయాల్లోనే రేషన్ తీసుకుంటున్నారు కార్డుదారులు. చౌక దుకాణాల వద్ద భౌతిక దూరం అమలును  పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు అధికారులు.
కార్డుదారుల బయోమెట్రిక్ లేకుండానే సచివాలయ ఉద్యోగుల ఆథరైజేషన్ తో డీలర్లు సరుకులను అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 29,783 చౌక దుకాణాలకు అదనంగా  14,315 వేల కౌంటర్ల ద్వారా బియ్యం, శనగలు పంపిణీ చేస్తున్నారు. 

 విజయవాడ రెండో విడత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రామలింగేశ్వర నగర్ నుండి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, జెసి మాధవీలత తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రెండో‌ విడత రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా  ముందు రెడ్ జోన్ల ప్రాంతాలలో ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. మూడు‌ విడతలుగా రేషన్ ఇస్తామని సిఎం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని కొనియాడారు. 

రెండో‌విడత రేషన్ ఈనెల 27వరకు అందిస్తామన్నారు. పేదలందరకీ ఇప్పటికే వెయ్యి రూపాయలు అందచేశామని... ఇప్పుడు మనిషికి ఐదు కిలోలు చొప్పున బియ్యంతో పాటు, ఒక్కో కార్డు పై కిలో శనగలు అందిస్తున్నామన్నారు. తెల్లకార్డు లేకపోయినా పేదవారిగా గుర్తిస్తే సరుకులు ఇస్తున్నామన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని...పక్క రాష్ట్రంలో లో కూర్చుని లేఖలు రాస్తూ శవ రాజకీయం చేయడం‌ ఆయనకే దక్కిందని మండిపడ్డారు.