లోకేష్ రాసిన లేఖపై రాష్ట్రపతి భవన్ స్పందన.. కేంద్ర హోం శాఖకు ఫార్వార్డ్..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు సంబంధించి జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నారా లోకేష్, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌లు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 26వ తేదీన రాసిన ఈ లేఖను తగిన చర్య కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాష్ట్రపతి భవన్ పంపింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ లోకేష్‌కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి లేఖ పంపారు. ఆ లేఖపై ష్ట్రపతి భవన్ డిప్యూటీ సెక్రటరీ రుబీనా చౌహాన్ సంతకం చేసి ఉంది.
ఇక, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలిసిన టీడీపీ నేతలు.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని లేఖలో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రేమచంద్రారెడ్డి, అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రస్తుత ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పేర్లు లేవని చెప్పారు. డిజైన్‌టెక్‌తో అనుసంధానించబడిన కంపెనీలు పన్ను ఎగవేత విషయంలో అప్పటి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.